2021-2026 కాలానికి 15వ ఆర్థిక సంఘం ఈ నెల 30లోపు తన నివేదికను సిద్ధం చేయనుంది. ఈ దిశగా కమిషన్ పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. నివేదికను సిద్ధం చేసిన అనంతరం 15వ ఆర్థిక సంఘం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
నివేదిక తుది రూపు సంతరించుకోనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్.. సంఘం మాజీ ఛైర్మన్లు సి.రంగరాజన్, విజయ్ కేల్కర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నివేదిక తయారీకి సంఘం చేసిన కృషిని ఈ ఇద్దరు మాజీ ఛైర్మన్‌లు ప్రశంసించారు.
కరోనా మహమ్మారి విజృంభణ, ఆర్థిక వ్యవస్ధపై దాని ప్రభావం మధ్య 15వ ఆర్థిక సంఘం అనేక సవాళ్లు ఎదుర్కొంటూ పని చేసిందని ప్రశంసలు కురిపించారు. 2021-26 కాలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలపై 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో సూచనలు, సలహాలు, ప్రతిపాదనలను పొందుపర్చనుంది.
ఇదీ చూడండి: 'ఆర్థిక సంఘానికి శాశ్వత హోదా ఇచ్చే ఆలోచన లేదు'