పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన పర్యటక, ఆతిథ్య రంగాలు.. ఈ బడ్జెట్‌పై భారీ ఆశలే పెట్టుకున్నాయి. లాక్డౌన్ కాలానికి అనుమతుల రుసుముల మినహాయింపు, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇన్పుట్ క్రెడిట్‌తో 10 శాతంగా ఒకే విధమైన జీఎస్టీ రేట్లతో పాటు ఇతర ఉపశమన చర్యలు ప్రకటిస్తారని ఆశించాయి. అయితే వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ కేటాయింపుల్లో భారీ కోత విధించింది సర్కార్.
పర్యటక శాఖకు 2020-21 బడ్డెట్లో రూ.2,500 కోట్లు కేటాయించింది సర్కార్. అయితే ఈ ఏడాది దీనిని రూ.2,026 కోట్లకు తగ్గించింది. అంటే దాదాపు 19 శాతం కోత విధించింది. కరోనా వైరస్ సంక్షోభంతో వచ్చిన భారీ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పర్యటక రంగానికి ఇది పెద్ద దెబ్బ.
- పర్యటకు శాఖకు బడ్జెట్‌లో సవరించిన అంచనా రూ.1,260 కోట్లు. అయితే ఈ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1088 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
- కరోనా వైరస్ సంక్షోభం దేశంలోకి విదేశీ పర్యటకుల రాకను మాత్రమే కాక దేశీయ టూరిస్టులను కూడా రాకుండా చేసింది. ఈ నేపథ్యంలో పర్యటకులను తిరిగి రప్పించడానికి అవసరమయ్యే ప్రచారం కోసమే నిధులను కేటాయించడంపై బడ్జెట్ దృష్టి పెట్టింది.
- పర్యటక ప్రదేశాల ప్రచారం కోసం కేటాయించిన రూ.668 కోట్లలో రూ. 524 కోట్లు విదేశీ మార్కెట్ కోసం, రూ.144 కోట్లు దేశీయ పర్యటకం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించింది.
- సర్వీసు ప్రొవైడర్ల సామర్థ్యం పెంపు కోసం రూ. 63.65 కోట్లు.. శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం రూ.138 కోట్లు కేటాయించింది.
అయితే పర్యటక రంగానికి తక్షణ ఆర్థిక సాయం అందేలా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం నిరాశపర్చిందని పర్యటక రంగ ప్రముఖులు అన్నారు.
"బడ్జెట్ ప్రకటనలో పర్యటక రంగానికి సంబంధించిన సంక్షోభం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పర్యటక, ప్రయాణ, ఆతిథ్య రంగం కొవిడ్- 19 కారణంగా శతాబ్దపు సంక్షోభంలో కూరుకుపోయింది. పునరుజ్జీవం కలిగించేలా ప్రభుత్వ చర్యలు తీసుకోకపోతే పర్యటకం గట్టెక్కడం కష్టమే."
- నకుల్ ఆనంద్, ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ (ఫెయిత్) ఛైర్మన్
ఇవీ చూడండి: