Budget 2022 Expectations: కేంద్ర బడ్జెట్‌లో పన్ను రేట్లను తగ్గిస్తే తద్వారా ఆ ప్రయోజనాన్ని ప్రజలు నేరుగా పొందగలుగుతారు. బడ్జెట్ 2022 నుంచి పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్న అతిపెద్ద ఉపశమనం ఇదే. ఆదాయ పన్ను శ్లాబులను విస్తరిస్తూ ప్రభుత్వం గతంలో తక్కువ పన్ను రేటును అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, కొత్త పన్ను శ్లాబులను ఎంచుకున్న వారికి ఎల్‌టీఏ, హెచ్‌ఆర్‌ఏ, సెక్షన్ 80సి, 80డి వంటి అనేక మినహాయింపులను దూరం చేసింది. పాత విధానంతో పాటు కొత్త దాంట్లో గరిష్ఠ పన్ను రేటు 30 శాతంగా ఉండడం గమనార్హం. దీంతో చాలా మంది పాత పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ సిటిజెన్లకు దీన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కార్పొరేటు పన్ను తగ్గించి దేశీయ కంపెనీలకు కొంత ఊరట కల్పించారు. ఈ నేపథ్యంలో సామాన్య వేతన జీవులు సహా ఇతర పన్ను చెల్లింపుదారులకు పన్ను రేటు తగ్గించి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎఫ్‌డీ, ఈఎల్‌ఎస్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్, హోంలోన్ అసలు, జీవిత బీమా ప్రీమియం వంటి చెల్లింపుల ద్వారా అనేక మంది సెక్షన్ 80సి ప్రయోజనాన్ని పొందుతున్నారు. అన్నింటికీ కలిపి ప్రస్తుతం లక్షా 50 వేల వరకు మినహాయింపు కోరవచ్చు. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలన్న డిమాండ్ సామాన్యుల నుంచి బలంగా వినిపిస్తోంది. తద్వారా పెట్టుబడులను పెంచుకోవడంతో పాటు మరింత అధిక హామీ మొత్తంతో కూడిన బీమాను పొందే సదుపాయం ఉంటుందని ఆశిస్తున్నారు.
వర్క్‌ఫ్రమ్‌హోం చేసేవారికి అలవెన్స్..
మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనేక కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇది చిరుద్యోగులకు రానురానూ భారంగా మారుతోంది. కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు కంపెనీలు కల్పించే వసతులన్నీ సొంత డబ్బుతో సమకూర్చుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నీచర్, ఇంటర్నెట్ ఛార్జీల కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వర్క్‌ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం 50 వేల రూపాయల వరకు అలవెన్సు ప్రకటించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తోంది.
కొవిడ్ ఖర్చులను 80డి పరిధిలోకి తీసుకొస్తే..
ప్రస్తుతం సెక్షన్ 80డి కింద సొంత బీమాతో పాటు భాగస్వామి, పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తోంది. దీంట్లో కొవిడ్ సంబంధిత వైద్య ఖర్చులను కూడా చేర్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తితో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చులను కూడా 80డి పరిధిలోకి తీసుకొస్తే కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
గత ఏడాది బడ్జెట్‌లో ఈపీఎఫ్‌కు ఏటా చెల్లించే మొత్తం రూ.2.5లక్షలు దాటిన అదనపు మొత్తంపై లభించే వడ్డీపై పన్ను విధించాలని నిర్ణయించారు. దీంతో అధిక వేతనం పొందుతున్నవారితో పాటు వీపీఎఫ్ చందాదారులకు అందే ప్రయోజనాల్లో కోతపడింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ చెల్లింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి పెంచాలన్న వాదన వినిపిస్తోంది.
- ఈ విధానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి చాలా మంది వీపీఎఫ్‌కు బదులు ఎన్‌పీఎస్ వంటి పింఛను ఆధారిత పథకాల్లో మదుపు చేయడానికి మొగ్గుచూపుతున్నారు.
- పింఛన్ ఆధారిత స్కీంల కాలపరిమితి ముగిసిన తర్వాత కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ కింద మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యాన్యుటీ మొత్తంపై పన్ను విధిస్తున్నారు.
- పీఎఫ్ నుంచి లభించే అదనపు వడ్డీపై కోతను తగ్గించడం సాధ్యంకాని పక్షంలో కనీసం యాన్యుటీ మొత్తంపై పన్ను నుంచైనా ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..
- పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కుదరకపోతే.. కనీసం ప్రస్తుతం ఉన్న సుంకాలనైనా తగ్గించాలని కోరుతున్నారు.
- కొవిడ్ నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త నైపుణ్యాల కోసం అనేక మంది ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శిక్షణకు అయ్యే ఖర్చులపై పన్ను రాయితీలు ఇస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
- రూ. లక్షన్నర వరకు ఉన్న స్కూల్ ఫీజులపై పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచాలని తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్.
- ఈక్విటీ లేదా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చే దీర్ఘకాల మూలధన రాబడిపై ప్రస్తుతం లక్ష వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.2 లక్షల వరకు పెంచాలని కోరుతున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక మంది ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి. మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులు కేంద్ర బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. అవి ఎంత వరకు నెరవేరతాయో చూడాలి మరి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉంది.. కానీ!