కోట్లాది మంది ప్రజల ఆశల మధ్య... ఆర్థిక సవాళ్ల నడుమ తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజలకు భారీ తాయిలాల ప్రకటన లేదు... మధ్యతరగతి ప్రజలు ఊహించిన పన్ను మినహాయింపు లేదు.. అయినప్పటికీ నవభారత నిర్మాణానికై స్థిరమైన ప్రయాణానికి కావాల్సిన కచ్చితమైన ప్రణాళికలు, అవసరమైన మార్గదర్శకాలను ప్రస్తావించారు సీతారామన్. వ్యవసాయం, అంకుర వ్యాపారం, పెట్టుబడులు, విద్య, తదితర రంగాలపై మాత్రం వరాల జల్లు కురిపించారు.
అత్యధిక మెజార్టీతో దేశంలో రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ 2.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టింది. తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రభావవంతంగా ప్రవేశపెట్టారు సీతారామన్. అన్ని రంగాలపై పూర్తి స్థాయి అవగాహనతో... వాస్తవ పరిస్థితుల చట్రంలోనే బడ్జెట్ ఉన్నట్లు అనిపిస్తోంది.
భారీ తాయిలాలు, హామీలతో ప్రజలను ఆశల ఊహల పల్లకి ఎక్కించకుండా... వాస్తవ పరిస్థితుల మధ్య పక్కా ప్రణాళికలను ప్రకటించారు విత్త మంత్రి.
వ్యవసాయం, వ్యాపారం, అంతరిక్షం, విద్య, ఉద్యోగం, గ్రామీణ భారతం, ఆరోగ్యం సహా పలు విషయాల్లో వాస్తవిక హామీలను కురింపించింది మోదీ 2.0 సర్కారు.