బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 'బ్యాడ్ బ్యాంకు' ఏర్పాటు తప్పనిసరని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అంతకంటే మరొక పరిష్కారం కూడా కనిపించటం లేదన్నారు. సాధారణ బ్యాంకులతో పోల్చితే మొండి బాకీల పరిష్కారంలో బ్యాడ్ బ్యాంకు త్వరితంగా, క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో ఈ ప్రయోగం విజయవంతమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
'దనహర్త ఆఫ్ మలేషియా' ఒక మంచి ఉదాహరణ, మనదేశంలో బ్యాడ్ బ్యాంకును రూపొందించటానికి ఈ సంస్థను అధ్యయనం చేయటం మేలు- అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
బ్యాడ్ బ్యాంక్ అంటే?
బ్యాంకుల వద్ద మొండి బాకీల ఖాతాలన్నింటినీ ఒక సంస్థకు బదిలీ చేసి సత్వరం ఆ ఖాతాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి సంస్థనే బ్యాడ్ బ్యాంకు అని వ్యవహరిస్తున్నారు.
మొండి బాకీలు భారీగా పెరిగే అవకాశం..
మనదేశంలో వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో బాగా పతనం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యాంకులకు మొండి బాకీలు అనూహ్యంగా పెరిగిపోతాయని విశ్లేషించారు సుబ్బారావు.
ఈ ఏడాది మార్చి నాటికి దేశీయంగా బ్యాంకులకు మొండి బాకీలు 8.5 శాతం ఉండగా, వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక స్పష్టం చేసింది. ఐబీసీ (ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్ట్సీ కోడ్) ద్వారా మొండి బాకీల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం లేదని, ఇప్పటికే ఐబీసీ వ్యవస్థ మీద మోయలేనంత పనిభారం ఉందని వివరించారు. బ్యాంకులు తమ అవసరాలకు తగినంతగా మూలధనాన్ని ఎలా సమకూర్చుకుంటాయనేది కూడా సమస్యగా కనిపిస్తోందని దువ్వూరి సుబ్బారావు అన్నారు..
ఇదీ చూడండి:నేడు జీఎస్టీ మండలి భేటీ- రాష్ట్రాల పరిహారంపై చర్చ