దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ సంక్షోభ ప్రభావాన్ని మదింపు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చనే సంకేతాలను కూడా ఇచ్చారు.
'మరో ఉద్దీపన సదుపాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనను ఇంకా పక్కన పెట్టలేదు. ఇప్పటి వరకు అలా చేసిన ప్రకటనలన్నీ.. అన్ని రకాల సంప్రదింపులు తర్వాత చేసినవే.' అని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ రచించిన హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్‌సైడ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెల్లడించారు సీతారామన్.
అక్టోబర్ ప్రారంభం నుంచే ఆర్థిక వ్యవస్థపై మదింపు ప్రక్రియ ప్రారంభమైందని.. త్వరలోనే నివేదికతో రానున్నట్లు వివరించారు. ప్రజలకు లేదా పార్లమెంట్లో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గురించి తాము కచ్చితంగా ప్రకటన చేయాల్సి వస్తుందని.. అందుకోసమే ఈ మదింపు చేస్తున్నట్లు చెప్పారు.
తయారీ రంగంపై దృష్టి సారించాలి:ముకేశ్
ఇదే కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. భారత్ తయారీ రంగం అంశాన్ని పునరాలోచించాలని సూచించారు. 'సాంకేతిక రంగంలో ఇటీవల అంకురాలు ఎలా పుట్టుకొస్తున్నాయో.. ఇప్పుడు చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఆ స్థాయిలో మద్దతు దక్కాల్సిన అవసరం ఉంది. అందుకే క్లిక్‌ల (కంప్యూటర్ల కీ బోర్డులపై క్లిక్‌లు) కంటే బ్రిక్‌లపై (ఇటుకలు) దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద'ని చమత్కరించారు.
ఇదీ చూడండి:'జియో విప్లవానికి కారణం అదే'