అప్లై చేయకుండానే కొన్ని సార్లు.. బ్యాంకుల నుంచి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ లేదా వ్యక్తిగత రుణం (Easy loans online) కావాలా అని అడుగుతుంటారు. లోన్ల ఖాతాలు పెంచుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ విధమైన మార్కెటింగ్ గిమ్మిక్కులు చేస్తుంటాయి. చాలామంది వీటిని పట్టించుకోరు. కొంత మంది ఈ ఆఫర్ల (Bank loan offers) వలలో చిక్కుకుంటారు.
అడగకుండానే ఎందుకు?
గత కొన్నేళ్లుగా కార్పొరేట్, ఎంఎస్ఎంఈ రుణాల విభాగంలో ఎన్పీఏలు పెరిగిపోవడం వల్ల.. రిటైల్ రుణాల విభాగంలో వృద్ధి కోసం బ్యాంకులు, రుణ సంస్థలు కృషి చేస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ కారణంగానే.. రిటైల్ వినియోగదారులకు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన వినియోగదారులకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయని అంటున్నారు.
అవసరానికి తగ్గట్లు రుణాలు..
ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. వినియోగదారుల అవసరాలను బట్టి రుణాలను ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులు, రుణ సంస్థలు. ఇందుకోసం ఖాతాదారుడు చేసే లాదేవీలను ప్రాతిపదికగా తీసుకుంటాయి.
ఉదాహరణకు, మీరు సినిమా టిక్కెట్లను కొనేందుకు ఎక్కువగా నెట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తుంటే బ్యాంకులు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను కొన్ని ప్రయోజనాలతో కలిపి ఆఫర్ చేస్తుంటాయి. షాపింగ్ కోసమైతే.. ఎక్కువ డిస్కౌంట్ లభించే ఆఫర్లతో కూడిన కార్డ్‌లను అందిస్తామని చెబుతుంటాయి. దీంతో ఇతర వినియోగదారులతో పోలిస్తే మీరు ఆ ఆఫర్‌ను పొందేందుకు ఆసక్తి చూపుతారు.
రిస్కు తెలుసుకునే..
అడగకుండానే లోన్ ఆఫర్ ఇచ్చినప్పటికీ.. తగిన జాగ్రత్తలు పాటిస్తుంటాయి బ్యాంకులు, రుణ సంస్థలు. ముఖ్యంగా లోన్ ఆఫర్ చేసే వ్యక్తి గత రుణ చరిత్రను క్రిడిట్ బ్యూరోల ద్వారా తెలుసుకుంటాయి. దీనితో రిస్క్ శాతాన్ని తగ్గించుకుంటుంటాయి.
లోన్ తీసుకోవాలా వద్దా?
అత్యవసర సమయాల్లో సులభంగా లభించే రుణాలు ఉపయోగకరమే అయినా, అవసరం లేకపోయినా ఇస్తున్నారు కదా అని రుణం తీసుకుంటే అప్పుల వలలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇవి క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తాయి. దీంతో అవసరమైన సమయంలో రుణాలు లభించడం కష్టమవుతుంది. అందుకే అవసరం ఉన్న సమయంలోనే రుణం తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు లేదా తిరిగి చెల్లించే సామర్థ్యం లేకుంటే.. వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
ఇవీ చదవండి: