కరోనా వల్ల పలు రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రయాణ, పర్యటక రంగాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు నుంచి ఆరు నెలల్లో 40 శాతం పర్యటక, ప్రయాణ సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని ఓ సర్వేలో తేలింది. సుమారు 36శాతం కంపెనీలు తాత్కాలికంగా మూతపడతాయని వెల్లడైంది. 81 శాతం పర్యటక రంగ సంస్థలు 100 శాతం ఆదాయం కోల్పోగా... 15 శాతం కంపెనీల ఆదాయం 75 శాతం మేరకు పడిపోయిందని నివేదిక పేర్కోంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని సర్వే తెలిపింది.
దేశవ్యాప్తంగా 10 రోజుల్లో 2300 పర్యటక రంగ కంపెనీల ప్రతినిధులు, యజమానులతో ఆన్లైన్లో సర్వే నిర్వహించినట్లు బోట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ తెలిపింది.
సర్వేలోని ముఖ్యాంశాలు..
- రాబోయే 3 నుంచి 6 నెలల్లో 40 శాతం కంపెనీలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. మరో 35.7 శాతం తాత్కాలికంగా మూసివేయవచ్చు.
- 38.6శాతం కంపెనీలు సిబ్బందిని తగ్గించే పనిలో ఉన్నాయి. కాగా 37.6 శాతం కంపెనీలు అనిశ్చితిలోకి జారుకున్నాయి.
- 73 శాతం ట్రావెల్ కంపెనీలు జీతాల కోత, ఒప్పందాలు సహా శ్రామిక శక్తిని తగ్గించే పనిలో ఉన్నాయి. 67 శాతం వ్యాపార నిర్వహణకు వ్యయాలు తగ్గించుకోవాలని ఆలోచనలో ఉన్నాయి.
- 49 శాతం మంది తమ మూలధన వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. అయితే మరో 41.6శాతం కంపెనీలు కొత్త సేవలను ప్రవేశపెట్టనున్నాయి.
- 78.6 శాతం పర్యటక రంగ కంపెనీలు... ప్రభుత్వం పర్యటక సహాయక నిధి ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. 68.2శాతం మంది విమానయాన సంస్థల నుంచి అడ్వాన్సులు వాపసు ఇవ్వాలని కోరుకుంటున్నాయి.
- 67.7శాతం.. పర్యటక రంగంపై ఉన్న జీఎస్టీని 5శాతం మేర తగ్గించాలని ఆశిస్తున్నాయి. 54.2శాతం మంది రుణాలపై 12నెలలు మారటోరియం కావాలని కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి: 'ప్రొఫైల్ లాక్'తో మీ ఎఫ్బీ ఖాతా మరింత భద్రం!