మీ ఎయిర్‌పాడ్స్ ఛార్జింగ్ కేసుపై కోరుకున్న ఎమోజీ ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే యాపిల్ ఇప్పుడు తన అధికారిక ఆన్లైన్ స్టోర్ నుంచి నేరుగా ఎమోజీలు ముద్రించిన ఎయిర్‌పాడ్స్ కేసులను అమ్మడం ప్రారంభించింది.
మీ భావోద్వేగాలు వ్యక్తీకరించవచ్చు!
రెండో తరం ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో లేజర్ ఛార్జింగ్ కేసులపై కొనుగోలుదారులు కోరుకునే ఎమోజీలను యాపిల్ ముద్రించి ఇవ్వనుంది. దీని ద్వారా వినియోగదారులు తమ భావోద్వేగాలను, వ్యక్తిత్వాలను చక్కగా వ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని 'యాపిల్' చెబుతోంది. ఇప్పటి వరకు వినియోగదారులు తమకు నచ్చిన అక్షరాలు, సంఖ్యలను మాత్రమే ఎయిర్‌పాడ్ కేసులపై ముద్రించుకునే అవకాశం ఉంది.
31 భావావేశాలు
యాపిల్ ప్రస్తుతానికి 31 ఎమోజీలను మాత్రమే అందిస్తోంది. స్మైలింగ్ ఫేస్, వింక్, ఫిస్ట్ బంప్, ద కిస్, థబ్స్అప్, ఏలియన్, యూనీకార్న్ తదితరాలు ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని ఎమోజీలను జతచేసే అవకాశం ఉంది. ఈ సేవ పూర్తిగా ఉచితం.
ఎమోజీ ట్రెండ్
ఎమోజీలు మన భావాలను వ్యక్తీకరించడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం. వీటిని ఉపయోగించని వారంటూ ఉండరేమో. ఈ ఎమోజీ ట్రెండ్‌లో ఎప్పుడూ ముందుండే యాపిల్.. ఎయిర్‌పాడ్స్ విషయంలో మాత్రం ఆలస్యం చేయడం ఆశ్చర్యకరం.
ఇదీ చూడండి: రెడ్మీ 8కి పోటీగా రియల్మీ 5ఐ- గురువారం లాంఛ్