తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వజ్రాల అన్వేషణకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్ర కుమార్ తెలిపారు. ఇనుప ఖనిజం తవ్వకాల్లో నిమగ్నమైన తమ సంస్థ చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నాగర్నార్‌లో చేపట్టిన 3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కల స్టీలు ప్లాంటును ఈ ఏడాది ప్రారంభిస్తామని, అక్కడే 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పెల్లెట్ ప్లాంటు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని 67 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు కొత్త గనుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక రసాయనాల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా డివిడెండ్ రూపంలో రూ.20వేల కోట్లకు పైగా చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎన్‌ఎండీసీ ఉత్పత్తి కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు:
ఇనుప ఖనిజం ఉత్పత్తి పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
2018-19లో ఎన్‌ఎండీసీ 32.36 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. 2019-20 మొదటి 9 నెలల్లో 22.01 మి.ట. ఉత్పత్తి నమోదు చేశాం. దేశీయ విపణిలో మాకు 25 శాతం వాటా ఉంది. ఇనుప ఖనిజ అవసరాలు వేగంగా పెరుగుతున్నందున, సమీప భవిష్యత్తులో 67 మి.ట. ఉత్పత్తి సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. కొత్త గనుల కోసం సన్నాహాలు చేస్తున్నాం.
ఉత్పత్తి ఇంత భారీగా పెంచడానికి ఎంత పెట్టుబడి అవసరం?
ప్రస్తుతం ఏటా 43 మి.ట. ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. దీన్ని 2025 నాటికి 67 మి.ట.కు పెంచుకునేందుకు రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది.
కొత్త ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి?
నాగర్నార్ స్టీలు ప్లాంటు నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరాంతానికి దీన్ని ప్రారంభిస్తాం. అక్కడే 2 మి.ట.వార్షిక సామర్థ్యంతో పెల్లెట్ ప్లాంటు నిర్మిస్తున్నాం. సామర్థ్య విస్తరణకు మాకు కొత్త గనులు కావాలి. సొంతంగా కొన్ని, చత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి మరికొన్ని కొత్త గనులు చేపట్టాలనుకుంటున్నాం. ప్రధానంగా బైలదిల్లాలో కొత్త గనులు తవ్వాలనుకుంటున్నాం. తవ్విన ఇనుప ఖనిజాన్ని గనుల నుంచి త్వరితంగా వినియోగదార్లకు సరఫరా చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై పెద్దఎత్తున పెట్టుబడి పెడుతున్నాం. ఇనుప ఖనిజాన్ని అధికంగా రవాణా చేసే కిరండూల్- జగదల్‌పూర్- అంబగావ్ రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసే పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే ఇనుప ఖనిజ రవాణా వార్షిక సామర్థ్యం ప్రస్తుత 28 మి.ట. నుంచి 40 మి.ట.కు పెరుగుతుంది. జగదల్‌పూర్- రౌఘాట్ మధ్య నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో ఎన్‌ఎండీసీ ప్రధాన భాగస్వామి. ఇక రెండు దశల్లో కిరండూల్- విశాఖపట్నం మధ్య స్లర్రీ పైప్‌లైన్ నిర్మిస్తున్నాం.
గనుల తవ్వకంలో నూతన సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఏ మేరకు వినియోగిస్తున్నారు?
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దేశీయంగా మాకెవరూ సాటిరారు. చత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల్లోని మా గనుల్లో నూరు శాతం యాంత్రీకరణ ఉంది. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో వజ్రాల గని కూడా పూర్తిగా ‘మెకనైజ్డ్ మైన్’. గనుల సర్వే, తవ్వకం, లోడింగ్, రవాణా.. వరకు అన్ని దశల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాం. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఎయిర్‌బార్న్ జియోఫిజికల్ సర్వే, ఐశాటిస్, మ్యాప్‌ఇన్ఫో, సర్‌ప్యాక్, మైన్‌స్కెడ్.. తదితర వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు పరుస్తున్నాం. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ‘రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీ’ నెలకొల్పాం. పర్యావరణానికి నష్టం కలగని రీతిలో గనుల తవ్వకానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం.
ఇనుప ఖనిజం ధరలు ఎలా ఉండొచ్చు?
వచ్చే కొంతకాలం పాటు ఇనుప ఖనిజం ధరలు స్థిరంగా ఉంటాయనిపిస్తోంది. ధర బాగా పెరగడం లేదా తగ్గడం ఉండదు. ధర 5- 10 శాతం అటూ ఇటూ ఉండొచ్చు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏమైనా గనులు, ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందా?
తెలంగాణాలోని పాల్వంచలో ఎన్‌ఎండీసీకి ఏడాదికి 60,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల స్పాంజ్ ఐరన్ యూనిట్ ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త గనులు తవ్వే అవకాశాలు అన్వేషిస్తున్నాం. డోలమైట్, బంగారం, వజ్రాల గనులు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. బంగారం, వజ్రాల గనులు తవ్వేందుకు కొంతకాలంగా పరిశీలన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్టీలు ప్లాంటుకు ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు ఈమధ్య ఒప్పందం కుదుర్చుకున్నాం.
ఇదీ చూడండి:ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందం ఎందుకు కుదరలేదు?