భారీ రుణ భారంలో కూరుకుపోయిన టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల చెల్లింపునకు సిద్ధమైంది. సంస్థ వ్యాపారాల కొనసాగింపుపై ఈ అంశం ఆందళనలు రెకెత్తిస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపునకు మొగ్గు చూపిస్తోంది వొడాఫోన్-ఐడియా. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏజీఆర్ బకాయిలను చెల్లించే ప్రక్రియలో ఉన్నామని ప్రకటించింది.
అయితే భారత్లో వ్యాపారాల కొనసాగింపు అనేది.. సుప్రీం కోర్టు ఇచ్చే సానుకూల తీర్పుపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఇటీవలే సవరణలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసింది ఈ సంస్థ. ఈ పిటిషన్పై మార్చి 17న విచారణ జరపనుంది అత్యన్నత న్యాయస్థానం.
వొడా-ఐడియా బాకాయి ఇలా...
ఏజీఆర్ బకాయి కింద వొడాఫోన్ ఐడియా దాదాపు రూ.53,038 కోట్లు డీఓటీకి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.24,729 కోట్లు స్పెక్ట్రమ్ రుసుము, రూ.28,309 కోట్లు లైసెన్స్ రుసుము. ఈ స్థాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉన్న కారణంగా తమకు ఎలాంటి ఉపశమనం లభించకపోతే భారత్లో వ్యాపారాలు మూసేయాల్సి వస్తుందని గతంలో ఆందోళన వ్యక్తం చేసింది ఈ సంస్థ.