కరోనా చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న రిమెడిసివిర్ ఔషధాలను దేశంలో విక్రయించేందుకు అనుమతి కోరుతూ అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్... భారత ఔషధ నియంత్రణ సంస్థకు(సీడీఎస్సీఓ) దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు రిమెడిసివిర్ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పించింది.
'రిమెడిసివిర్ అమ్మకాలకు అనుమతి కోసం గిలియడ్ దరఖాస్తు చేసింది. ఈ అభ్యర్థనను నిపుణుల కమిటీ ద్వారా పరిశీలించి.. ఇచ్చిన సిఫార్సుల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామ'ని అధికార వర్గాలు ప్రకటించాయి.
ఈ ఔషధాన్ని భారత్‌లోనే తయారు చేసి.. అమ్మేందుకు భారతీయ ఫార్మా సంస్థలు సిప్లా, హెటిరో ల్యాబ్స్ గిలియాడ్ సైన్సెస్‌తో ఒప్పందం చేసుకున్నాయి. యాంటీ వైరల్ ఔషధమైన రిమెడిసివిర్‌ను అత్యవసర సమయాల్లో కొవిడ్ రోగుల చికిత్స కోసం వినియోగించవచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ సిఫార్సు చేసింది.
అయితే ఈ ఔషధంపై అమెరికా అందించిన క్లినికల్ డేటా ఆధారంగా.. తమదేశంలో రిమెడిసివిర్‌ను వాడేందుకు జపాన్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ప్రత్యేక పరిస్థితులలో రిమెడిసివిర్ వినియోగానికి అనుమతి లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా వల్ల 11 ఏళ్ల వెనక్కి దేశార్థికం