ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ 2021 ఎడిషన్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ బైక్‌ను బుధవారం విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320 (ఎక్స్‌షోరూం, దిల్లీ), డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270గా నిర్ణయించింది కంపెనీ.
రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ-మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రత్యేకతలు..
- 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్
- 9,250 ఆర్‌పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది
- ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతిని ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
- ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణ.
- పాత అపాచీల వెర్షన్‌లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తగ్గడం విశేషం.
ఎకో స్పోర్ట్ కొత్త వేరియంట్..
భారత్‌లో మంచి ఆదరణ దక్కించుకున్న ఎకోస్పోర్ట్స్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్‌ను ఫోర్డ్ ఇండియా బుధవారం విడుదల చేసింది. సిగ్నేచర్ రియర్మౌంట్ వీల్‌తో, వీల్ లేకుండా రెండు వేరియంట్లలో ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది ఫోర్డ్.
సరికొత్త ఎకోస్పోర్ట్స్ పెట్రోల్ వేరియంట్ ధర (ఎక్స్ షోరూం) రూ.10.49 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర (ఎక్స్ షోరూం) రూ.10.99 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.
ప్రత్యేకతలు..
- పెట్రోల్ వేరియంట్ 1.5 లీటర్ ట్రిపుల్ సిలిండర్ 122 పీఎస్ శక్తిని, 149 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేసింది.
- డీజిల్ వేరియంట్ 1.5లీటర్ ఇంజిన్‌తో 100 పీఎస్ శక్తి, 215 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేసింది.
- 5-ఎంటీ-గేర్‌బాక్స్
మేడ్ ఇన్ ఇండియా ఎం340ఐ ఎక్స్‌డ్రైవ్
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎం340ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం ప్రకటించింది. దీని ధర (ఎక్స్ షోరూం) రూ.62.9 లక్షలుగా నిర్ణయించింది. పూర్తిగా భారత్‌లో తయారైన ఎం ఇంజిన్ తొలి వేరియంట్ ఇదేనని బీఎండబ్ల్యూ వెల్లడించింది.
ప్రత్యేకతలు..
- 2,998 సీసీ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్
- 387 హార్స్ పవర్, 50 ఎన్ఎం పీక్ టార్క్
- 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.4 సెకన్లలో అందుకునే సామర్థ్యం
- టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు
- 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్
హోండా సీబీ 350 ఆర్‌ఎస్ డెలివరీ ప్రారంభం..
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా సీబీ 350 ఆర్‌ఎస్ బైక్‌ల డెలివరీలు ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. భారత మార్కెట్లో ఇటీవల ఈ మోడల్‌ను ఫిబ్రవరి 16న విడుదల చేసింది హోండా. ఈ బైక్ ధర(దిల్లీ ఎక్స్‌షోరూం)లో రూ.1.96లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. దీనిలో ఆర్‌ఎస్ అంటే 'రోడ్ సెయిలింగ్' అని అర్థం.
రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350, క్లాసిక్ 350, జావా ఫార్టీటూ వంటి బైక్‌లకు పోటీగా సీబీ 350ఆర్ఎస్ను హోండా మార్కెట్లోకి తెచ్చింది.