టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కొత్త నిబంధనలు సాంకేతిక అంశాల కారణంగా ఆలస్యం కానున్నాయి. నూతన నిబంధనలను నవంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకురానున్నామని తొలుత ప్రకటించింది ట్రాయ్. సాంకేతికంగా తలెత్తిన సమస్యలతో ఈ ప్రక్రియ అమలుకు ఆలస్యం కానుందని సవరణ ప్రకటన చేసింది. అయితే.. ఈ ప్రక్రియ అమలు తేదీని ప్రకటించలేదు. అప్పటి వరకు పాత విధానమే కొనసాగుతుందని తెలిపింది.
సులభంగా మారేందుకు..
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించిన నిబంధనల గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. టెలికాం పరిశ్రమలో వినియోగదారులు ఎక్కువగా డిమాండ్ చేసే సేవల్లో పోర్టబిలిటీ ఒకటి.ప్రస్తుత ఎంఎన్‌పీ ప్రక్రియ కనెక్టివిటీకి ఆటంకం కలిగిస్తుంది. ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్(మారడానికి) చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో ఇది సులభమవుతుంది.
సమయాన్ని తగ్గించడానికే..
మొబైల్ నంబర్ పోర్టబిలిటీని మరింత సులభతరం చేస్తూ ట్రాయ్ 2018 డిసెంబర్లో నూతన నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడం సహా ఇది పూర్తి కావడానికి ఉన్న గడువును 7 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిస్తూ నిబంధనలు మార్చింది.
కొత్త ట్రాయ్ కొత్త ఎంఎన్‌పీ నిబంధనలు సిమ్‌ను ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ చేయడానికి ఆపరేటర్లు తీసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
అంతరాయం లేకుండా వేగంగా మారడానికి ఈ నియమాలు దోహదపడతాయి.
అన్నీ తర్వాతే..
ఎంఎన్‌పీపై కొత్త నిబంధనలు ఈ రంగంలో సానుకూల మార్పును తీసుకురానున్నాయి. అయితే వీటి అమలు జరిగే వరకు అంటే.. నవంబర్ 10 వరకు ఎటువంటి పోర్టింగ్ సేవలు అందుబాటులో ఉండవు. వినియోగదారులు ఎటువంటి పోర్టింగ్ కోడ్‌ను పొందలేరు.
ఇదీ చూడండి: దిల్లీ 'వాయు కాలుష్యం'పై సుప్రీం ఆగ్రహం