రైతుల ఆందోళనలో భాగంగా తమ టవర్ల ధ్వంసం వెనుక ప్రత్యర్థి టెలికాం సంస్థలు ఉన్నాయంటూ జియో చేసిన ఫిర్యాదుపై ఎయిర్‌టెల్ స్పందించింది. జియో చేసినవి నిరాధార ఆరోపణలని పేర్కొంది. ఈ మేరకు టెలికాం విభాగం (డాట్) సెక్రటరీ అన్షు ప్రకాశ్‌కు లేఖ రాసింది. గతంలో కూడా జియో తమపై ఫిర్యాదు చేసిందని ఎయిర్‌టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ తన లేఖలో పేర్కొన్నారు.
రైతుల ఆందోళన వెనుక ఎయిర్‌టెల్ ఉందని జియో ఆరోపించడం సరికాదని వాట్స్ పేర్కొన్నారు. జియో నుంచి పోర్ట్ అవ్వాలని తాము సూచించామనడమూ సరికాదన్నారు. ఒకవేళ అదే పవర్ తమకు ఉంటే మూడేళ్ల క్రితమే ఆ పనిచేసి ఉండేవాళ్లమని చెప్పారు. అదే జరిగితే జియోలో అంతమంది సబ్‌స్క్రైబర్లు చేరుండేవారు కాదని పరోక్షంగా పేర్కొన్నారు. 25 ఏళ్లుగా టెలికాం రంగంలో వినియోగదారులకు ఉత్తమమైన సేవలందిస్తూ మార్కెట్లో నిలదొక్కుకున్నామని చెప్పారు. అలాగే టెలికాం సేవలకు అంతరాయం కలిగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.