వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి వచ్చి నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు జీఎస్టీపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ప్రస్తుత సమయం జీఎస్టీ రెండో దశ అని.. ఇది సంస్కరణలకు సమయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
చమురు, గ్యాస్, విద్యుత్, స్థిరాస్తి, మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పన్నులను 2-3 స్లాబులకు పరిమితం చేయాలని సూచిస్తున్నాయి.
"జీఎస్టీ 2.0.. భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి స్థానాలకు తీసుకెళ్తుంది. గడచిన రెండేళ్లు జీఎస్టీకి మైలు రాయిగా నిలుస్తాయి."
--- విక్రమ్ కిర్లోస్కర్, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు
"జీఎస్టీ అమలులో ఎదురైన సమస్యలను చాలావరకు పరిష్కరించుకోగలిగాం. ఇప్పుడు జీఎస్టీ విధానాలను సరళించడం, పరోక్ష సుంకాల వ్యవస్థను మరింత సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలి."
---సందీప్ సోమని, ఫిక్కీ అధ్యక్షుడు
"కేవలం రెండేళ్లలో పన్నులను జీఎస్టీ ఏకీకృతం చేసింది. వ్యాపారాలను సులభంగా నిర్వహించడం సహా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించింది" అని పారిశ్రామికవేత్త, సీఐఐ మాజీ అధ్యక్షుడు ఆది గోద్రేజ్ అన్నారు. సుంకాలను డిజిటల్ రూపంలో చెల్లించే వ్యవస్థను జీఎస్టీ సులభతరం చేసిందని ఆయన కితాబిచ్చారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ప్రత్యేకం: జీఎస్టీ ప్రస్థానానికి రెండేళ్లు