పంజాబ్,మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్‌కు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ముంబయి ఆర్థిక నేరాల విభాగ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ.4,355 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా వీరిని అరెస్టు చేశారు. దీనితో పీఎంసీ కుంభకోణంలో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 12కి చేరింది.
హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్)కు ఇచ్చిన రుణాల అంశంపై దర్యాప్తు చేసేందుకు.. పీఎంసీ డైరెక్టర్లు జగదీశ్ మూఖే, ముక్తి బవిసి, త్రిపాఠి బానేలను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో మూఖే 2005 నుంచి బ్యాంకు డైరెక్టర్‌గా, ఆడిట్ కమిటీ సభ్యునిగా ఉన్నట్లు పేర్కొన్నారు. బవిసి 2011 నుంచి డైరెక్టర్.. లోన్లు, అడ్వాన్సుల కమిటీ సభ్యునిగా ఉన్నట్లు వెల్లడించారు.
త్రిపాఠి బానే 2010 నుంచి 2015 వరకు లోన్ రికవరీ కమిటీ సభ్యుడిగా.. ఆ తర్వాత 2015 నుంచి లోన్లు, అడ్వాన్సుల కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.