శాంసంగ్ ల్యాబ్స్ 'నియాన్' పేరుతో సరికొత్త ఆవిష్కరణ చేసింది. అచ్చం మనుషుల్లాగే మాట్లాడగలిగే కృత్రిమ మానవులను సృష్టించింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఈ డిజిటల్ రూపాలు సంభాషించగలవని, సాటివారిపై సానుభూతినీ చూపించగలవని కంపెనీ పేర్కొంది. లాస్ వేగాస్‌లో '2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో' ప్రారంభం సందర్భంగా శాంసంగ్ యూనిట్ స్టార్ ల్యాబ్స్‌లో ఉత్పత్తి చేసిన నియాన్ వివరాలను వెల్లడించింది.
అయితే, కొంత మంది పరిశ్రమ నిపుణులు మాత్రం 'నియాన్'లో అంతర్లీనంగా వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 'నియాన్'లో చెప్పుకోదగిన రహస్యం ఏమీ లేదు. ఇది కూడా 'ఏఐ'తో రూపొందిన ఒక డిజిటల్ అవతారమే. మాకు తెలిసినంత వరకు ఇది వరకే ఉన్న కృత్రిమ మనిషి 'సిరి'లానే ఇది కూడా ఉంది. మీరు వెతుకుతున్న కృత్రిమ మానవులు ఇవి కాదని స్పెషలైజ్డ్ టెక్ వెబ్‌సైట్ 'ద వెర్జ్' విశ్లేషించింది. నియాన్లు మన స్నేహితులు, సహచరులు. ఇవి నిరంతరం నేర్చుకుంటూ ఉంటాయి. వాటి పరస్పర చర్యల వల్ల జ్ఞాపకాలు ఏర్పడటమే కాకుండా పదిలమవుతుంటాయని ల్యాబ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రణవ్ మిస్త్రీ వెల్లడించారు. న్యూరల్ నెట్‌వర్క్‌లు, కంప్యుటేషనల్ రియాల్టీతో కూడిన అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో నియాన్లను సృష్టించామని వాటి సృష్టికర్తలు చెబుతున్నారు.
భారతీయ ప్రతిభ..
ఈ ప్రయోగశాలను 2019లో శామ్‌సంగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు, శాంసంగ్ మొబైల్ ఇన్నోవేషన్ విభాగాధ్యక్షుడిగా ఉన్న మిస్త్రీ ఆవిష్కరించారు. ఆయన భారత్‌లో జన్మించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లలో ప్రాజెక్టులు చేశారు. సంజ్ఞల ఆధారంగా పనిచేసే ఉపకరణాల్లో వినియోగించే సిక్త్స్ సెన్స్ అభివృద్ధిలో ఆయనకు ప్రాచుర్యం ఉంది. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ సాంకేతికను అభివృద్ధి చేశారు.
టీవీ ప్రయోక్తలు, సినిమా నటులు, అధికార ప్రతినిధుల వంటి వారిని డిజిటల్ రూపంలో సృష్టించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని శాంసంగ్ తెలిపింది. మానవ స్పందనలు (ఎమోషన్స్) కూడా వీటికి నిక్షిప్తం చేయొచ్చని సంస్థ పేర్కొంది. ప్రతి నియాన్ ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి తనదైన హావభావాలు, కదలికలతో సంభాషణలు పలకగలదని తెలిపింది. వినియోగదారు సేవా కేంద్రాలు, వినోద రంగాల్లో ఎక్కువగా వినియోగించుకోవచ్చని ప్రకటించింది.
ఇదీ చూడండి:జేమ్స్ కేమరూన్ డిజైన్ చేసిన 'అవతార్' బెంజ్ కారు ఇదే!