దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం (Carona case in India) పడుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ (COVID vaccination in India) ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నీ త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలు పెంచుతున్నాయి. దీనితో కార్పొరేట్ ప్రపంచంలో కూడా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. దిగ్గజ సంస్థలన్నీ తమ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోంకు (End to Work form home) ముగింపు పలికి.. వారిని ఆఫీస్‌లకు తిరిగి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్స్, ఆమ్వే, డాబర్, గోద్రెజ్ వంటి సంస్థలు.. ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోం, ఆఫీస్‌లో పని, హైబ్రిడ్ మోడళ్లలో ఏదో ఒక దాన్ని ఐచ్ఛికంగా ఎంచుకునే అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ కంపెనీలు ఇప్పటికే ప్రకటన..
తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని ఈ ఏడాది చివరి నాటికి ఆఫీస్‌లకు రప్పించాలని భావిస్తున్నట్లు.. టెక్ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సీఈఓ రాజేశ్ గోపినాథ్ ఇటీవలే ప్రకటించారు. అయితే 2025 నాటికి నాటికి 25 శాతం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగులు.. వారంలో రెండు రోజులు ఆఫీస్‌లో పని చేస్తున్నట్లు విప్రో ఈ నెలలోనే ప్రకటించింది. ఇన్ఫోసిస్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా.. టీసీఎస్ మోడల్‌ను అనుసరించే అవకాశముందని తెలుస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, డెలాయిట్ వంటి సంస్థలు రానున్న రెండు నెలల్లో తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని ఆఫీస్‌లకు రప్పించే ఆస్కారముంది. ఇప్పటికే కోటక్ మహీంద్రా బ్యాంక్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులను ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది.
ఉద్యోగులు ఏమనుకుంటున్నారు?
దేశవ్యాప్తంగా ఉద్యోగులపై చేసిన ఓ సర్వే ద్వారా లింక్డ్ఇన్ కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో ఎక్కువమంది ఉద్యోగులు.. వృత్తి, వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యమివ్వాలంటే.. హైబ్రిడ్ వర్క్ తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
డెలాయిట్ చేసిన మరో సర్వేలో 84 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం సురక్షితమేనని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్ చేసే వారి కోసం.. ఎస్బీఐ బంపర్ ఆఫర్!