ఐరోపా కార్యకలాపాల నుంచి దాదాపు 3 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది టాటా స్టీల్. ఈ విషయాన్ని సంస్థ యాజమాన్యం ధ్రువీకరించింది. ఐరోపాలో స్తబ్దుగా, అంతర్జాతీయ మార్కెట్లో అవసరానికి మించి ఉన్న ఉక్కు డిమాండ్ సమస్యలను ఎదుర్కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది.
ముఖ్యంగా కార్యాలయాల్లో పని చేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో.. మూడింట రెండొంతుల మందిని తొలగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నెదర్లాండ్స్‌కు చెందిన ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం పారిశ్రామిక రంగాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఎక్కువగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి.
టాటా స్టీల్ విషయానికొస్తే.. సంక్షోభంలో చిక్కుకోకుండా జర్మనీకి చెందిన థైసెన్‌క్రప్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆ ఒప్పందం కుదరకపోవడం కారణంగా తీవ్ర ఒడుదొడుకుల్లోకి జారుకుంది. ఉద్యోగులను తగ్గించుకున్నప్పటికీ.. సంస్థ కార్యకలాపాలు నిలిపే ప్రసక్తే లేదని టాటా స్టీల్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ దరఖాస్తులు @77,000