ప్రస్తుతం ఉన్న సుంకాల చట్టం స్థానంలో రూపొందించిన నూతన ప్రత్యక్ష పన్నుల చట్టం ముసాయిదా సమర్పణకు మరో రెండు నెలల గడువు పెరిగింది. సుంకాల చట్టంలో మార్పు అవసరమని రెండేళ్ల క్రితం మోదీ చేసిన సూచనల మేరకు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటై కొత్త ముసాయిదా రూపొందించే పనిలో నిమగ్నమయింది.
మే 31న ముసాయిదా సమర్పించాల్సి ఉండగా.. "సుంకాల కొత్త ముసాయిదా సమర్పణ గడువును జులై 31 వరకు పొడగించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ" అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారికంగా ప్రకటించింది.
పలు దఫాల్లో గడువు పెంపు
మొదట ప్యానెల్ ఏర్పడిన 6 నెలల్లోనే (2018 మే 22) నివేదిక సమర్పించాలని భావించింది. పలు కారణాల వల్ల గడువు పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్యానెల్ కన్వీనర్‌గా ఉన్న అర్వింద్ మోదీ 2018 సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందారు. ఆ స్థానంలో అఖిలేశ్ రంజన్‌ను నియమిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కారణంగా ముసాయిదా సమర్పణకు 2019 ఫిబ్రవరి 28 వరకు తొలుత గడువు పెంచారు. అయితే మళ్లీ మే 31న ముసాయిదాను సమర్పించాలని కమిటీ భావించింది. తాజాగా మరొకసారి జులై 31 వరకు గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
కొత్త పన్నుల విధానం?
పన్నుల శాఖ ఉన్నతాధికారుల వార్షిక సదస్సులో భాగంగా 2017 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సుంకాల చట్టం 1961 ఇప్పటికే 50 ఏళ్లు దాటిపోయిందని.. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా దానిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కొత్త సుంకాల చట్టం రూపకల్పనకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యుడు అర్వింద్ మోదీని కన్వీనర్‌గా నియమిస్తూ ఐదుగురు సభ్యులతో కార్యదళ కమిటీ ఏర్పాటుచేసింది ప్రభుత్వం.
ఇతర దేశాల్లో అమల్లో ఉన్న పన్ను చట్టాలను కమిటీ అధ్యయనం చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా కొత్త చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం గతంలో సూచించింది.