ఆర్థిక, ఐటీ షేర్ల ఊతంతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 90 పాయింట్లు బలపడి 38,690 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 11,613 వద్ద కొనసాగుతోంది.
ఇవీ కారణాలు
అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలు నేటి ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, ఐటీ రంగాల్లో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధుల బృందం అమెరికాకు వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో చర్చలపై అంచనాలు మార్కెట్లకు సానుకూలంగా మారాయి.
లాభానష్టాల్లోనివే
సెన్సెక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, వేదాంత, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు ఒక శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంకు, యస్ బ్యాంకు, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
రూపాయి నేడు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ 69.40 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ స్వల్పంగా తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 71.09 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇతరమార్కెట్లు ఇలా
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, హాంకాంగ్ సూచీ-హాంగ్ సెంగ్, జపాన్ సూచీ-నిక్కీ దక్షిణ కొరియా సూచీ-కోస్పీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.