అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, దేశీయంగా ఆర్థిక రంగంపై నెలకొన్న అనిశ్చితుల నడుమ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 45 పాయింట్ల నష్టంతో 37,046 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించింది. 11,133 వద్ద కొనసాగుతోంది.
ఇవీ కారణాలు
నేటి మార్కెట్లను అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం విదేశీ మదుపరులను కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు లొంగేది లేదని చైనా తేల్చి చెప్పడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ నేపథ్యంలో అమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారు.
వీటికి తోడు దేశీయంగా బ్యాంకింగ్యేతర ఆర్థిక రంగంపై ఏర్పడ్డ అనిశ్చితులు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్న మరిన్ని కారణాలు.
లాభానష్టాల్లోనివే
నిన్నటి భారీ నష్టాల నుంచి తేరుకుని భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి సన్ ఫార్మా షేర్లు. వేదాంత, టాటా మోటార్స్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎంఆండ్ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి స్వల్పంగా బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.46 వద్ద ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ 0.10 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయంతో ఆసియాలోని అన్ని ప్రధాన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఇదీ చదవండి: నాన్ బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం తలెత్తొచ్చు!