స్టాక్ మార్కెట్లు నేడు రయ్రయ్ మంటూ దూసుకుపోయాయి. నిన్న వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సుస్థిర ఆర్థిక విధానాలు కొనసాగుతాయనే నమ్మకంతో మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి చూపారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 623 పాయింట్లు లాభ పడింది. ఫలితంగా 39,435 పాయింట్లతో జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 187 పాయింట్ల వృద్ధితో.. 11,844 జీవనకాల గరిష్ఠాల వద్ద సెషన్ ముగించింది.
లాభనష్టాల్లో ఉన్నవివే..
ఐసీఐసీఐ బ్యాంకు 5.09 శాతం, ఎల్ అండ్ టీ 4.60 శాతం, భారతీ ఎయిర్టెల్ 4.42 శాతం, వేదాంత 4.20 శాతం, టాటా మోటార్స్ 4.09 శాతం, ఎం అండ్ ఎం 3.82 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఎన్టీపీసీ 0.54 శాతం, టీసీఎస్ 0.20 శాతం, హెచ్‌యూఎల్ 0.10 శాతం నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ మూడు షేర్లు మాత్రమే నష్టపోయాయి.
ఇంట్రాడేలో ఇలా..
ఇంట్రాడేలో 38,824- 39,476 (జీవనకాల గరిష్ఠం) పాయింట్ల మధ్య కదలాడింది సెన్సెక్స్.
నిఫ్టీ నేటి ఇంట్రాడేలో 11,859 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఓ దశలో ఈ సూచీ 11,658 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
అమెరికా-చైనా వాణిజ్య భయాల నేపథ్యంలో ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.