స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ముగిశాయి. చమురు, సహజ వాయువు, వైద్య రంగాల్లో నమోదైన లాభాలతో సూచీలు కాస్త కుదుటపడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్, ఎల్&టీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 10.25 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 38,730.82 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 2.70 పాయింట్లు కోల్పోయి 11,555.90 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా...
సెన్సెక్స్ నేడు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. సెషన్ మొత్తం 38,436- 38,814 పాయింట్ల మధ్య కదలాడింది ఈ సూచీ.
నిఫ్టీ నేడు 11,582 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఒకానొక దశలో 11,461 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫినాన్స్ 5.60 శాతం, సన్ ఫార్మా 5.28 శాతం, హీరో మోటార్స్ 3.14 శాతం, ఎల్&టీ 2.44 శాతం, రిలయన్స్ 2.20 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.70 శాతం లాభపడ్డాయి.
టీసీఎస్ నేడు 2019-20 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో.. సంస్థ షేర్లు అత్యధికంగా 2.05 శాతం నష్టపోయాయి.
ఎస్ బ్యాంకు 1.88 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 1.88 శాతం, ఐటీసీ 1.53 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.44 శాతం, మారుతీ 1.43 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి సెషన్లో రూపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలర్‌తో మారకం విలువ 68.64 డాలర్ల వద్ద ఉంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.39 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.36 డాలర్లుగా ఉంది.