కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్తు దేశం చేస్తున్న పోరులో నిత్యావసర వస్తువుల(ఎఫ్‌ఎంసీజీ) తయారీ సంస్థలు కూడా భాగమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి విపత్కర సమయంలో తమ బాధ్యతనెరిగి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఎంతో కీలకమైన సబ్బులతో పాటు ఇతర శానిటైజర్ ఉత్పత్తులను పెంచడం సహా ధరను కూడా తగ్గించాలని నిర్ణయించాయి.
ఉత్పత్తి పెంపు..
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. లైఫ్‌బాయ్ శానిటైజర్లు, లైఫ్ లిక్విడ్ హ్యాండ్‌వాష్, డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరను 15 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. వీటి ఉత్పత్తిని తక్షణమే ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. త్వరలో ఇవి మార్కెట్లోకి రానున్నాయంది. ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. అలాగే అవసరమైన ప్రాంతాల్లో రెండు కోట్ల లైఫ్‌బాయ్ సబ్బుల్ని ఉచితంగా పంచుతామని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాలతో కలిసి పనిచేస్తున్నామని సంస్థ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు.
వినియోగదారులపై భారం ఉండదు
హెచ్‌యూఎల్ బాటలోనే పతంజలి, గోద్రేజ్ సంస్థలూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అలోవెరా, హల్దీ-చందన్ సబ్బుల ధరను 12.5 శాతం తగ్గిస్తున్నట్లు పతంజలి అధికార ప్రతినిధి ఎస్.కె.తిజరావ్లా ప్రకటించారు. ఇక ఇటీవల కాలంలో పెరిగిన ముడిసరకు ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై పడనివ్వబోమని గోద్రేజ్ వెల్లడించింది. సబ్బుల తయారీకి అవసరమయ్యే ముడిసరకు ధరలు గత కొన్ని నెలల్లో 30శాతం పెరిగాయని.. దీంతో ధరను పెంచాలని ఇటీవల నిర్ణయించామన్నారు. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఈఓ సునీల్ కటారియా తెలిపారు.