2019 జనవరి-మార్చి మధ్య 32.1 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించినట్లు ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. గతేడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 7.1 శాతం అధికం. ఇదే సమయానికి ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 6 శాతం తగ్గినట్లు పేర్కొంది.
అగ్రస్థానం 'షామీ'దే
తొలి త్రైమాసికంలో 8.1 శాతం వృద్ధితో చైనా సంస్థ షామీ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శామ్సంగ్ అమ్మకాలు 4.8 శాతం క్షీణించి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఒప్పో గతంతో పోలిస్తే అమ్మకాల్లో రెండింతలు ( 9.7 శాతం) వృద్ధితో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
"ఆకర్షణీయ ఆఫర్లు, ధరలు సహా షామీ, శామ్సంగ్, రియల్ మి, హువావే వంటి కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం కారణంగా ఆన్లైన్ అమ్మకాలు 2019 క్యూ1లో 40.2 శాతం పెరిగాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో 36 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు గెలాక్సీ ఎస్10 శ్రేణి ఊతం అందించింది. వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ అధికంగా అమ్ముడైన ప్రీమియం ఫోన్ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది."
- ఉపాసన జోషి, రీసెర్చ్ మేనేజర్, క్లయింట్ డివైజ్, ఐడీసీ ఇండియా