బ్యాంకింగ్, వాహన రంగాల సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఆటో మెుబైల్ రంగ సంక్షోభానికి పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆటోమొబైల్ రంగానికి భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 125 పాయింట్లు పుంజుకుంది. చివరకు 37,271 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11,036 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 37,343 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,194 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,055 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,012 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
నేటి ట్రేడింగ్‌లో ఎస్ బ్యాంకు (13.47 శాతం), టాటా మోటార్స్ (10.21 శాతం) అత్యధిక లాభాలను నమోదు చేశాయి. మారుతీ 4.18 శాతం, టాటా స్టీల్ 3.85 శాతం, వేదాంత 3.44 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.83 శాతం లాభాలను ఆర్జించాయి.
ఓఎన్జీసీ 3.17 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 2.48 శాతం, ఎన్టీపీసీ 1.74 శాతం, సన్‌ఫార్మా 1.57 శాతం, టీసీఎస్ 1.34 శాతం, పవర్ గ్రిడ్ 1.33 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: మీ 'బాస్'కన్నా మీరే సమర్థంగా పని చేయగలరా...?