స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. భారత్‌లో సేవా రంగ కార్యకలాపాలు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయన్న ఓ సర్వే అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. కరోనా వైరస్ చికిత్స విషయంలో పురోగతి.. అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. నేటి లాభాలకు ఇదీ ఓ కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 353 పాయింట్ల వృద్ధితో 41,143 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 111 పాయింట్లు పుంజుకుని 12,090 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,177 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,703 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,098 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,953 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
టాటా స్టీల్ 5.14 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.77 శాతం, టీసీఎస్ 1.91 శాతం, హెచ్డీఎఫ్సీ 1.85 శాతం, ఎల్&టీ 1.57 శాతం, రిలయన్స్ 1.56 శాతం లాభపడ్డాయి.
హీరో మోటోకార్ప్ 3.55 శాతం, మారుతీ 2.25 శాతం, పవర్ గ్రిడ్ 2.24 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.98 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి:ఏడేళ్ల గరిష్ఠానికి సేవారంగ కార్యకలాపాలు