స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో ప్రారంభం నుంచే నష్టాల్లో ట్రేడయిన సూచీలు.. ఏ దశలోను కోలుకోలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయని నిపుణులు అంటున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయింది. చివరకు 39,194 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 107 పాయింట్ల నష్టంతో 11,724 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా...
సెన్సెక్స్ సెషన్ ట్రేడింగ్‌లో 38,121-39,608 పాయింట్ల మధ్య కదలాడింది. నిఫ్టీ 11,828 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,705 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎస్బీఐ 1.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.55 శాతం మేర లాభపడ్డాయి. వేదాంత, ఎన్టీపీసీ, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంకు లాభాల జాబితాలో ఉన్నాయి.
యస్ బ్యాంకు అత్యధికంగా 4.36 శాతం నష్టాన్ని మూటగట్టుకుంది. మారుతి 3.39, హెచ్డీఎఫ్సీ 2.63, హీరో మోటార్స్ 2.17, హెచ్‌యూఎల్ 2.04 శాతం మేర నష్టపోయాయి.
రూపాయి, ముడిచమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 69.55గా ఉంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.51 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.78 వద్ద ఉంది.
ఇదీ చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడి యోచనలో అమెరికా?