స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, వృద్ధి మందగమనం అంచనాలు సహ పలు ఇతర ప్రతికూలతలు మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 560 పాయింట్లు క్షీణించింది. చివరకు 38,337 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 178 పాయింట్ల నష్టంతో 11,419 వద్ద ముగిసింది.
ఇవీ కారణాలు
విదేశీ పెట్టుబడుదారులు తమను తాము ట్రస్టీలుగా కాకుండా కంపెనీలుగా నమోదు చేసుకోవాలని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారుల్లో అధిక పన్ను భయాలు నెలకొన్నాయి. ఫలితంగా పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపారు. భారత ద్రవ్యలోటు ప్రస్తుతం 68 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తాజా గణాంకాల్లో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇది 49 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఈ గణాంకాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. వీటికి తోడు అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ భయాలు కూడా మార్కెట్ల నష్టాలకు కారణం.
ఇంట్రాడే సాగిందిలా..
ఒడుదొడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 39,059 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా... ఒకానొక దశలో 38,271 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ నేడు 11,640 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేయగా.. 11,399 పాయింట్ల అత్యల్ప స్థాయికి తగ్గింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ 2.32 శాతం, పవర్ గ్రిడ్ 0.61 శాతం, టీసీఎస్ 0.55 శాతం, ఓఎన్జీసీ 0.42 శాతం లాభ పడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ నాలుగు సంస్థలు మాత్రమే బలపడ్డాయి.
ఎం&ఎం 4.36 శాతం, బజాజ్ ఫినాన్స్ 4.16 శాతం, టాటా మోటార్స్ 3.73 శాతం, హీరో మోటార్స్ 3.71 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.40 శాతం, ఎస్ బ్యాంకు 2.97 శాతం నష్టపోయాయి.
రూపాయి, ముడి చమురు
నేటి సెషన్లో రూపాయి 5 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 68.92 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.71 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 62.99 డాలర్లగా ఉంది.
ఇదీ చూడండి: 'హాట్ స్టార్' నెం.1.. జియో లైవ్ టీవీ హవా