సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన తీర్పుపై టెలికాం సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది అత్యున్నత న్యాయస్థానం. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో ఏజీఆర్‌పై టెలికాం విభాగం (డీఓటీ) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ ఏ నజీర్, జస్టిస్ ఎం ఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌కు రివ్యూ విచారణ అర్హతలేదని అభిప్రాయపడింది.
రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో విచారించాలని టెలికాం సంస్థలు అభ్యర్థించగా.. సుప్రీం కోర్టు మాత్రం ఇన్-చాంబర్లో పరిశీలనకు చేపట్టింది.
బకాయిల వివరాలు ఇలా..
నవంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయిపడ్డట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ అపరాధ రుసుములపై వడ్డీ తగ్గించే ప్రతిపాదనేదీ లేదనే విషయాన్నీ వెల్లడించారు.
టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఈ బకాయిలలో రూ.92,642 కోట్లు చెల్లింపులు చేయని లైసెన్సు రుసుములు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్ వినియోగ బకాయిలుగా పేర్కొన్నారు రవి శంకర్ ప్రసాద్.
కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..
- ఎయిర్టెల్ రూ.21,682.13 కోట్లు
- వొడాఫోన్ రూ.19,823.71 కోట్లు
- ఆర్‌కాం రూ.16,456.47 కోట్లు
- బీఎస్ఎన్ఎల్ రూ.2,098.72 కోట్లు
- ఎంటీఎన్ఎల్ రూ.2,537.48 కోట్లు
సుప్రీం తీర్పుపై ఎయిర్టెల్ స్పందన
సుప్రీం కోర్టు తీర్పు నిరాశపరిచినట్లు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రకటించింది. దీనిపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:ఏజీఆర్ వివాదంపై మరిన్ని వివరాలుకు ఇక్కడ క్లిక్ చేయండి