రిజర్వు బ్యాంకుకు సుప్రీం కోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదిక వివరాలను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయాలని స్పష్టంచేసింది.
వివరాల బహిర్గతంపై ఇప్పటికే ఓసారి ఆదేశాలు జారీ చేసిన కారణంగా... ఆర్బీఐకి ఇది చివరి అవకాశమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఈ మేరకు ఆర్బీఐ విధానాలను పునఃసమీక్షించుకోవాలని జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.
ఇదీ నేపథ్యం
బ్యాంకుల వార్షిక తనిఖీ వివరాలు, నిబంధనల ఉల్లంఘన కింద కొన్ని బ్యాంకులకు విధించిన అపరాధ రుసుముకు సంబంధించిన పూర్తి సమాచారం కోరుతూ ఆర్టీఐ కార్యకర్త ఎస్సీ అగర్వాల్ ఆర్బీఐకి ఆర్జీ పెట్టుకున్నారు.
ఈ సమాచారాన్ని ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఇలాంటి సమాచారం ఇవ్వడం కుదరదని చెప్పింది. ఈ విషయంపై అగర్వాల్ సుప్రీంను ఆశ్రయించారు.