దేశీయ అతిపెద్ద, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.6,504 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ. 2020-21 క్యూ1లో బ్యాంక్ నికర లాభం రూ.4,189 కోట్లుగా ఉంది.
మొండి రుణాలు తగ్గటమే.. నికర లాభం ఈ స్థాయిలో పెరిగేందుకు కారణమని ఎస్బీఐ వివరించింది.
2021-22 క్యూ1 ఆదాయం క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. రూ.74,457.86 కోట్ల నుంచి రూ.77,347.17 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది ఎస్బీఐ. ఆదాయంలో.. బ్యాంక్ కార్యకలాపాల వాటా రూ.18,975 కోట్లు.. వడ్డీల ద్వారా రూ.66,500 కోట్లు గడించినట్లు తెలిపింది.
బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 5.32 శాతానికి తగ్గినట్లు ఎస్బీఐ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో ఎన్పీఏలు 5.44 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో నికర నిరర్ధక ఆస్తులు (నెట్ ఎన్పీఏలు) కూడా 1.8 శాతం నుంచి.. 1.7 శాతానికి దిగొచ్చినట్లు వివరించింది.
ఇదీ చదవండి: పాత నోట్లు, నాణేలు పేరుతో మోసాలు- ఆర్బీఐ వార్నింగ్