సంక్షోభంలో ఉన్న ఎస్ బ్యాంకు నుంచి దాదాపు రూ.7,250కోట్లు విలువగల షేర్లను కొనేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు అంగీకరించింది. 725కోట్ల ఎస్‌బ్యాంకు షేర్ల(ఒక్కో దాని విలువ రూ.10)ను కొనేందుకు ‘ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు’ ఆమోద ముద్ర వేసిందని ఎస్‌బీఐ ప్రకటించింది.
49 శాతం వాటా..
గురువారం జరిగిన బోర్డు మీటింగులో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే మొదట్లో కేవలం రూ.2,450కోట్ల పెట్టుబడికే మొగ్గుచూపిన ఎస్‌బీఐ బోర్డు తాజాగా రూ.7,250 కోట్లకు ఆమోదించడం విశేషం. దీంతో ఎస్ బ్యాంకులో ఎస్‌బీఐ కంపెనీ వాటా 49శాతం ఉండనుంది. ఆర్‌బీఐ ప్రకటించిన 'ఎస్ బ్యాంకు లిమిటెడ్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, 2020’ ముసాయిదా ప్రకారం ఈ వాటా సొంతం చేసుకోనుంది. దీనిప్రకారం వచ్చే మూడు సంవత్సరాల్లో 26శాతం వాటా తగ్గకుండా ఎస్‌బ్యాంకులో ఈ పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది.
వారాతంలో మారటోరియం ఎత్తివేత..
సంక్షోభంలో ఉన్న ఎస్‌బ్యాంకుకు ఆర్‌బీఐ 30రోజుల మారటోరియం గడువు విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎస్‌బ్యాంక్ బోర్డును తాత్కాలికంగా రద్దు చేసిన ఆర్‌బీఐ, ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓను ఎస్‌బ్యాంక్ పాలనాధికారిగా నియమించింది. ఈ మారటోరియం కాలంలో ఖాతాదారులు కేవలం రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకునేలా ఆంక్షలు విధించింది. అయితే తాజా పరిస్థితుల్లో.. ఈ వారం చివరిలోగా మారటోరియాన్ని ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి:రికార్డు స్థాయి పతనాలపై నిపుణుల మాటేంటి?