రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆటో స్క్రాపింగ్ విధానం కూడా త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆటోమొబైల్ రంగంపై కరోనా మహమ్మారి ప్రభావానికి సంబంధించి భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గడ్కరీ. వ్యాపారంలో ఎత్తుపల్లాలు సాధారణమేమని.. ద్రవ్య లభ్యతను పెంచటంపై దృష్టి సారించాలని సూచించారు.
" అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలంటే.. ఆటో పరిశ్రమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికత, పరిశోధన నైపుణ్యత పై దృష్టి సారించాలి. వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల విలువైన రహదారులు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. మధ్యవర్తిత్వ కేసుల పరిష్కారానికి మా శాఖ ఓవర్ టైం పని చేస్తోంది. ఆటో స్క్రాపింగ్ విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించాం. ఖర్చు తగ్గింపు విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది."
– నితిన్ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి.
అన్ని విధాలా సాయం..
బీఎస్-4 వాహనాల విషయమై అడిగిన ప్రశ్నకు.. సుప్రీం కోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గడ్కరీ. అయితే.. పరిశ్రమ వర్గాల వినతి మేరకు ఈ అంశాన్ని తిరిగి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇతర నిబంధనల సడలింపుల విషయంలో సాధ్యమైన చోట ఉపశమనం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ నుంచి అన్ని విధాల సాయం అందుతుందని భరోసా కల్పించారు.