దేశీయ ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ రిటైల్ విపణిలో పట్టుకోసం దిగ్గజ సంస్థల మధ్య పోరు మరింత తీవ్రమవుతోంది. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, గోదాముల వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ చేసుకున్న ఒప్పందాన్ని, అంతకుముందే ఫ్యూచర్ కూపన్స్‌ను కొనుగోలు చేసిన అమెజాన్.. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్)లో సవాలు చేసిన సంగతి విదితమే. తుది ఆదేశాలు ఇచ్చేవరకు రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆర్బిట్రేషన్ ఆదేశాలిచ్చింది. అయితే అమెజాన్‌పై కోర్టుకు వెళ్తామని ఫ్యూచర్ రిటైల్ ప్రకటించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జారీ అయిన మధ్యవర్తిత్వ ఆదేశాలను సవాలు చేస్తామని కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్(ఎఫ్‌ఆర్‌ఎల్) సంకేతాలిచ్చింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లో పరోక్షంగా మైనారిటీ వాటా కొనుగోలు చేసిన అమెజాన్.కామ్, రిలయన్స్-ఫ్యూచర్‌పై ఆర్బిట్రేషన్ ప్రక్రియకు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తుది నిర్ణయం వెలువడేంత వరకు ఫ్యూచర్ రిటైల్, ఆ సంస్థ వ్యవస్థాపకులు ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదని ఆదివారం సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్(ఎస్‌ఐఏసీ) మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
పరిశీలిస్తున్నాం: ఫ్యూచర్ రిటైల్
'ఎస్‌ఐఏసీ' పంపిన పత్రాలను 'పరిశీలిస్తున్నామ'ని సోమవారం ఫ్యూచర్ రిటైల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెజాన్ లేవదీసిన ఆర్బిట్రేషన్ ప్రక్రియలో చెబుతున్న ఒప్పందంలో ఎఫ్‌ఆర్‌ఎల్ భాగమే కాదు. ఎఫ్‌ఆర్‌ఎల్/బోర్డు తీసుకున్న అన్ని చర్యలు, ఒప్పందాలు అందరు వాటాదార్ల ప్రయోజనాల కోసమే. ఆ ఒప్పందాలన్నీ భారత చట్టాలు, భారత ఆర్బిట్రేషన్ చట్టంలోని నిబంధనలన్నీ పాటించింది. అయితే మధ్యంతర ఆదేశాలు 'పలు మూలాల్లోని న్యాయ అంశాలను లేవనెత్తుతున్నాయ'ని చెప్పుకొచ్చింది. ఒప్పందం ఎటువంటి ఆలస్యం లేకుండా జరుగుతుంది. అందుకు తగిన చర్యలు మేం తీసుకుంటామ’ని స్పష్టం చేసింది. రిలయన్స్ రిటైల్ కూడా లావాదేవీకి సంబంధించిన అన్ని హక్కులను వినియోగించుకుంటామని స్పష్టం చేసింది.
అమెజాన్ వాదన ఏమిటంటే..
గతేడాది ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ 49 శాతం వాటా కొనుగోలు చేసింది. (ఫ్యూచర్ రిటైల్‌లో ఈ కంపెనీకి 7.3 శాతం వాటా ఉంది.) అప్పటి కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఫ్యూచర్ రిటైల్‌ను 3-10 ఏళ్ల తర్వాత కొనుగోలు చేసేందుకు, 'తొలి తిరస్కరణ' హక్కులు, నాన్-కాంపీట్ ఒప్పంద హక్కులు అమెజాన్‌కు వచ్చాయి. ఇటీవల జరిగిన రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందం ఈ హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ సింగపూర్ ఆర్బిట్రేషన్‌లో సవాలు చేసింది.
10 శాతం పడ్డ ఫ్యూచర్ గ్రూప్ షేర్లు
ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 10 శాతం వరకు పడిపోయాయి. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ 9.71%, ఫ్యూచర్ రిటైల్ 5.08%, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ 4.99%(లోయర్ సర్క్యూట్), ఫ్యూచర్ కన్జూమర్ 4.92% చొప్పున నష్టపోవడం గమనార్హం.
'ఫ్యూచర్' కోసం అంబానీ, బెజోస్ పట్టు
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీలు భారత రిటైల్ రంగంలో ఆధిపత్యం కోసం పోటీపడడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, లాజిస్టిక్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవడం కోసం భారీ ఒప్పందాన్ని ముకేశ్ అంబానీ కుదుర్చుకోగా.. ఆ ఒప్పందాన్ని నిలిపివేసి.. బరిలోకి దిగాలని జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్.కామ్ భావిస్తోంది. అందుకు ఆర్బిట్రేషన్ కోర్టుకూ వెళ్లి మధ్యంతర ఉత్తర్వుల్లో ఊరట పొందింది.
ఎందుకు ఇలా?
అమెజాన్‌కు భారతీయ ఇ-కామర్స్ రంగంలో పట్టు ఉంది. అయితే చిన్న నగరాలు, పట్టణాల్లోకి ఇంకా భారీ స్థాయిలో వెళ్లలేదు. ఫ్యూచర్ గ్రూప్‌నకు భారత నగరాలు, చిన్న పట్టణాల్లో గ్రాసరీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని విక్రయాలూ చేసే స్టోర్లున్నాయి. వీటిని అందిపుచ్చుకుని అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ బలంగా మారాలని అమెజాన్ భావిస్తోంది. అందుకే భారత్‌పై 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా భారత రిటైల్‌లో భారీ స్థాయిలో విస్తరణకు సిద్ధమైంది ఆర్‌ఐఎల్. ఆన్‌లైన్‌లోనూ జియోమార్ట్ ద్వారా సత్తా చాటుతోంది. ఫ్యూచర్ గ్రూప్ విక్రయశాలలు తోడైతే, మరింతవాటా లభిస్తుందన్నది రిలయన్స్ యోచన.