వరుసగా నాలుగో ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ)లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి మందగమనం అంచనాల నేపథ్యంలో మరో 25 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఏడాది జరిగిన మూడు ఎంపీసీ సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్లు చొప్పున వడ్డీ రేట్ల కోత విధించింది ఆర్బీఐ. నేటి నుంచి 7వ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనున్న ఎంపీసీ సమావేశం ఈ ఏడాది నాలుగోది.
పరిశ్రమ వర్గాల అంచనా అదే
బ్యాంకులకు లిక్విడిటీ సమస్యలు తీర్చేందుకు.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ.. రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. వృద్ధి మందగిస్తుందన్న అంచనాలు, ఆర్బీఐ అంచనాలకు లోబడే ద్రవ్యోల్బణం ఉండటం ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమల సమాఖ్య సీఐఐ తెలిపింది.
నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి.. రూ.60,000 కోట్ల నగదును వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి: విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ఇండియా