పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పీఓఎస్‌బీ) ఖాతాదారులు మ్యాగ్నెటిక్ ఏటీఎం కార్డులకు బదులుగా ఈఎంవీ చిప్ కార్డులను తీసుకునేందుకు జనవరి 31, 2020 చివరి తేదీ. ఈ నేపథ్యంలో తక్షణమే తమ కార్డును మార్చుకోవాలని హెచ్చరించింది బీఓఎస్బీ. వినియోగదారులు తమ మొబైల్ నంబర్లనూ అప్‌డేట్ చేయాలని కోరింది.
ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ప్రకారం, జనవరి 31 లోగా పాత డెబిట్ కార్డును మార్చుకోవాలి. లేదంటే ఆ తర్వాత తమ కార్డును ఉపయోగించలేరు. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు, ఇప్పటికే ఉన్న ఎటీఎం కార్డును భర్తీ చేసేందుకు పీఓఎన్బీ ఖాతాదారుడు పోస్టాఫీస్ శాఖను సందర్శించాలి.
ఈఎంవీ చిప్ కార్డులు అంటే?
మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులతో పోలిస్తే చిప్-ఆధారిత కార్డులు డేటా ఎన్క్రిప్షన్, స్టోరేజ్ సాంకేతికత, అధిక ప్రమాణాలను కలిగి ఉంటాయి. లావాదేవీని పూర్తి చేయడానికి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరంలో స్వైప్ అవసరమయ్యే మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డుల మాదిరిగా కాకుండా, లావాదేవీని పూర్తి చేయడానికి చిప్ పిన్ కార్డులకు పిన్ అవసరం.
పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా..
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసిన సంవత్సరానికి 4% చొప్పున వడ్డీని చెల్లిస్తుంది. పొదుపు ఖాతాతో పాటు, కొన్ని ఉపసంహరణ పరిమితులు, లావాదేవీ ఛార్జీలతో ఎటీఎం కార్డులను అందిస్తుంది. ఎటీఎం కార్డు ద్వారా రోజుకు రూ.25,000 నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:సెల్‌ఫోన్ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?