లండన్‌లో జైలు జీవితం అనుభవిస్తోన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి చెందిన 4 స్విస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు అధికారులు. నీరవ్‌తో పాటు ఆయన సోదరి బ్యాంకు ఖాతాలనూ సీజ్ చేశారు.
ఈ నాలుగు అకౌంట్లలో ప్రస్తుతం రూ. 283.16 కోట్ల మేర ధనం పోగైందని అధికారికంగా వెల్లడించారు స్విస్ అధికారులు. నీరవ్ ఈ ధనం అక్రమంగా సంపాదించి... స్విస్ బ్యాంక్‌లో దాచారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. స్విట్జర్లాండ్ అధికారులకు తెలిపింది.
అనంతరం.. ఈడీ అభ్యర్థన మేరకు నీరవ్, ఆయన సోదరికి చెందిన నాలుగు స్విస్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు అక్కడి అధికారులు. ఈడీ ఇప్పుడీ బ్యాంకు ఖాతాలను పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నియత్రణ చట్టం) కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేయనుంది.
నీరవ్ మోదీపై రుణ ఎగవేత కేసు సహా మనీలాండరింగ్ ఆరోపణలున్నాయి. ఇదే అంశంలో ఆయనను ఈ ఏడాది మార్చిలో బ్రిటన్ అధికారులు అరెస్టు చేశారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో భారత్‌కు అప్పగించే అంశంపై విచారణ జరుగుతోంది.