కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పీఎంసీ ఖాతాదారుల నిరసన సెగ తగిలింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి వచ్చిన ఆమెకు పంజాబ్- మహారాష్ట్ర సహకార బ్యాంకు ఖాతాదారులు తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు.
ముంబయికి సీతారామన్ చేరుకున్నారని తెలుసుకున్న వందలాది మంది పీఎంసీ ఖాతాదారులు భాజపా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న సొమ్మును నయా పైసలతో సహా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఖాతాదారులతో భేటీ
కొంతమంది ఖాతాదారులను పిలిపించుకొని... పాలనాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకు మూతపడటానికి గల కారణాలను వారికి వివరించారు.
బ్యాంకు యాజమాన్యం ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అందువల్లే నగదు విత్ డ్రా చేయడంపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అన్నారు. ఈ అంశాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు నిర్మల.
"ఈ విషయంలో ఆర్థిక శాఖ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకులను నియంత్రిస్తుంది. చట్ట ప్రకారం వాళ్లు చేయాల్సింది చేస్తున్నారు. నా తరఫున ఆర్థిక శాఖ కార్యదర్శులతో మాట్లాడాను. గ్రామీణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయాలని సూచించా. ఈ కమిటీలో డిప్యూటీ గవర్నర్ స్థాయి ఆర్బీఐ అధికారి ఉంటారు. తర్వాత పాలనపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా నిబంధనలు రూపొందిస్తాం. ఇటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడతాం. ఇది ప్రస్తుతానికి హామీ మాత్రమే.. కానీ భవిష్యత్తులో నిజమవుతుంది. వచ్చే శీతకాల సమావేశాల్లో అవసరమైతే కావాల్సిన సవరణలు చేసేందుకూ సిద్ధంగా ఉన్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
పీఎంసీ కుంభకోణం...
పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్ నుంచి హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
ఇదీ చూడండి: చైనా దెబ్బకు ఆ యాప్‌ను తొలగించిన యాపిల్