పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) కేసును దిల్లీ హైకోర్టు నేడు విచారించింది. నగదు ఉపసంహరణపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించింది ధర్మాసనం. పిటిషన్‌పై కేంద్రం, దిల్లీ సర్కారు, ఆర్బీఐ తమ స్పందన తెలపాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.ఎన్.పటేల్, జస్టిస్ సి.హరి శంకర్‌తో కూడిన ధర్మాసనం... ఆర్థిక మంత్రిత్వ శాఖ, దిల్లీ ప్రభుత్వం, ఆర్బీఐ, పీఎంసీ బ్యాంకులకు నోటీసు జారీ చేసింది. పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లకు 100 శాతం బీమా ఇవ్వాలన్న వాదనపైనా తమ అభిప్రాయం తెలపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.
పీఎంసీ బ్యాంకు రూ.4,355 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల నగదు ఉపసంహరణపై బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆరు నెలల్లో రూ.40,000 మాత్రమే ఉపసంహరించుకోవాలనే ఆంక్షలతో పీఎంసీ ఖాతాదారుల్లో భయాలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: మొదటిసారిగా 108 ఎమ్పీ కెమెరాతో.. షియోమీ నోట్ 10!