అంతర్జాతీయంగా చమురు సంక్షోభంతో దేశీయంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రోజు వారీ ధరల సవరణ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి ఆరు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.1.59 పెరిగింది. డీజిల్ ధర లీటర్‌కు రూ.1.31 ఎగబాకింది.
ఆదివారం ఒక్క రోజే దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి.. రూ.73.62కు చేరింది. డీజిల్ లీటర్‌కు 18 పైసలు ఎగిసి రూ.66.74కు చేరింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ ప్రతిపాదికన సవరించే విధానాన్ని 2017లో ప్రారంభించింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ స్థాయిలో ధరలు వరుసగా పెరగటం ఇదే ప్రథమం.
ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఆరాంకో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి తర్వాత అంతర్జాతీయంగా చమురు సంక్షోభం మొదలైంది. సెప్టెంబర్ 16న హౌతీ తిరుగుబాటుదార్లు చేసిన ఈ దాడితో ప్రపంచ చమురు ఉత్పత్తిలో 5 శాతం తగ్గిపోయింది. అప్పటినుంచి ముడి చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నెలాఖరు లోగా తగ్గిన ఉత్పత్తిని తిరిగి పునరుద్ధరిస్తామని.. ఆరాంకో ప్రతినిధులు అంటున్నా.. చమురు అనిశ్చితులు కొనసాగుతున్నాయి.
భారత్‌పై ప్రభావమెంతంటే..
భారత్‌కు.. సౌదీ రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. సౌదీ నుంచి ప్రతి నెల 2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. సెప్టెంబర్ నెలకు.. 1.2 నుంచి 1.3 మిలియన్ టన్నుల ముడి చమురును ఇప్పటికే భారత్ దిగుమతి చేసుకుంది. మిగతా మొత్తాన్ని సరఫరా చేసేందుకు భారత్‌కు సౌదీ హామీ ఇచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరుకు భారత్ 207.3 మిలియన్ టన్నుల ముడి చమురు దిమగుతి చేసుకుంది. అందులో 40.33 మిలియన్ టన్నులు సౌదీ నుంచే దిగుమతి కావడం గమనార్హం.
ఎల్పీజీ విషయానికొస్తే.. ప్రతి నెల 2 లక్షల టన్నుల ఎల్పీజీని సౌదీ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.
ఇదీ చూడండి: మోదీ పర్యటనపై.. అమెరికా కార్పొరేట్ల భారీ ఆశలు