దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దిల్లీలో నేడు లీటర్ పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.72.42కు చేరింది. డీజిల్ లీటర్‌పై 25 పైసలు పెరిగి రూ.65.82గా ఉంది. ఒక్క రోజులోనే ఇంత ఎక్కువగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటం జులై 5 తర్వాత ఇదే ప్రథమం.
సౌదీలోని ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదార్ల డ్రోన్ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయి. నెలాఖరులోగా ఆరామ్కో శుద్ధి కేంద్రంలో ఉత్పత్తి సాధారణ స్థాయికి వస్తుందని సంస్థ అధికారులు ప్రకటిస్తున్నా.. భారత్ వంటి దేశాలపై చమురు ధరల ప్రభావం తగ్గడం లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్రోల్,డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది.
భారత్ ముడి చమురు అవసరాల్లో 83 శాతం మేర దిగుమతిపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రతికూల ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర కేబినెట్ ఆమోదం