దేశీయంగా వాహనాల అమ్మకాలు నవంబర్‌లో మళ్లీ తగ్గినట్లు వాహన తయారీదారుల సంఘం.. 'సియామ్' తెలిపింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్‌లో స్వల్పంగా పుంజుకున్న అమ్మకాలు తిరిగి నవంబర్‌లో తగ్గడం గమనార్హం.
'సియామ్' గణాంకాల ప్రకారం.. 2019 నవంబర్‌లో అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 2,63,773. గత ఏడాది ఇదే నెలలో వీటి అమ్మకాలు 2,66,000గా ఉన్నాయి. 2018 నవంబర్‌తో పోలిస్తే.. 2019 నవంబర్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 0.84 శాతం తగ్గాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు నవంబర్‌లో.. 14.98 శాతం తగ్గి.. 61,907 యూనిట్లు విక్రయమైనట్లు సియామ్ పేర్కొంది.
వాహన రకం | 2019 నవంబర్ | 2018 నవంబర్ | క్షీణత |
కార్లు | 1,60,306 | 1,79,783 | 10.83 శాతం |
వ్యాన్లు | 10,728 | 16,333 | 34.32 శాతం |
ద్విచక్ర వాహనాలు | 14,10,939 | 16,45,783 | 14.27 శాతం |
మోటార్ సైకిళ్లు | 8,93,538 | 10,49,651 | 14.87 శాతం |
స్కూటర్లు | 4,59,851 | 5,21,542 | 11.83 శాతం |
నవంబర్‌లో విక్రయాలు తగ్గినప్పటికీ.. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి పెరిగిందని సియామ్ పేర్కొంది. నవంబరులో ఉత్పత్తి 4.06శాతం పెరిగి.. 2,90,727 యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది.