దేశీయ ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. వరుసగా 11వ నెలలోనూ ప్రయాణ వాహనాల విక్రయాలు పడిపోయాయి. దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 2019 సెప్టెంబర్‌లో 23.69 శాతం తగ్గాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ (సియామ్) ఈమేరకు తాజా గణాంకాలు వెల్లడించింది.
సెప్టెంబర్ నెలలో ప్రయాణ వాహనాల అమ్మకాలు 2,23,317 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ వెల్లడించింది. 2018 సెప్టెంబర్ విక్రయాలు 2,92, 660 యూనిట్లుగా ఉన్నట్లు గుర్తుచేసింది.
దేశీయ కార్ల విక్రయాల్లో 2018 సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది 33.4 శాతం క్షీణత నమోదయింది. 2018 సెప్టెంబర్‌లో 1,97,124 కార్లు అమ్ముడవగా.. గత నెలలో ఇది 1,31, 281 యూనిట్లకు పరిమితమైంది.
మోటర్ సైకిల్ విక్రయాలు గత నెలలో 23.29 శాతం తగ్గాయి. 2019 సెప్టెంబర్‌లో 10,43,624 యూనిట్లకు అమ్ముడవగా.. 2018 సెప్టెంబర్‌లో 13,60,415 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
ద్విచక్ర వాహనాల అమ్మకాలు సెప్టెంబర్‌లో 22.09 శాతం క్షీణించాయి. 2019 సెప్టెంబర్‌లో 16,56,774 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ పేర్కొంది. 2018 సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 21,26,445 యూనిట్లుగా ఉన్నాయి.
వాణిజ్య వాహనాల విక్రయాలు 2019 సెప్టెంబర్‌లో 39.06 శాతం క్షీణించి.. 58,419 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి వీటి అమ్మకాలు 95,870 యూనిట్లుగా ఉన్నాయి.
అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా 20,04,932 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2018 సెప్టెంబర్‌లో అమ్ముడైన 25,84,062 యూనిట్లతో పోల్చితే ఇది 22.41 శాతం తక్కువ అని సియామ్ పేర్కొంది.
ఇదీ చూడండి: సేవలు నిలిచిన 10 గూగుల్ యాప్‌లు ఇవే..