ప్రస్తుత ఆర్థిక సంవత్సర అర్ధభాగం (ఏప్రిల్-సెప్టెంబర్)లో ప్రయాణ వాహనాల ఎగుమతులు 4 శాతం వృద్ధి సాధించినట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1.03 లక్షల వాహనాల ఎగుమతులతో 'హ్యూందాయ్ మోటర్స్ ఇండియా' అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది.
2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మొత్తం ప్రయాణ వాహనాల ఎగుమతులు 3,65,282 యూనిట్లుగా పేర్కొంది సియామ్. గతేడాది ఇదే సమయానికి 3,49,951 వాహనాలు ఎగుమతైనట్లు తెలిపింది.
యుటిలిటీ వాహనాల ఎగుమతులు 77,397 యూనిట్లకు చేరుకున్న కారణంగా కార్ల ఎగుమతుల్లో 5.61 శాతం వృద్ధి నమోదైనట్లు సియామ్ తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబర్‌లో మొత్తం 2,86,495 కార్లు ఎగుమతి అయినట్లు పేర్కొంది.
వ్యాన్స్‌లో తగ్గుదల..
ప్రయాణ వాహనాల ఎగుమతుల్లో వృద్ధి ఉన్నప్పటికీ వ్యాన్ల ఎగుమతుల్లో 27.57 తగ్గినట్లు సియామ్ తెలిపింది. ఈ అర్ధ సంవత్సరంలో మొత్తం 1,390 వ్యాన్లు మాత్రమే ఎగుమతి అయినట్లు పేర్కొంది. గతేడాది ఈ సంఖ్య మొత్తం 1,919 యూనిట్లుగా ఉంది.
తొలి స్థానంలో హ్యూందాయ్...
ప్రయాణ వాహనాల ఎగుమతుల్లో హ్యూందాయ్ మోటర్స్ 19.26 శాతం వృద్ధితో మొత్తం 1,03,300 యూనిట్లు ఎగుమతి చేసి తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఫోర్డ్ ఇండియా (71,850), మారుతీ సుజుకీ (52,603) ఉన్నాయి. నాలుగో స్థానంలో జనరల్ మోటర్స్ (40,096), ఐదో స్థానంలో ఫోక్స్‌వ్యాగన్ (37,908), ఆరో స్థానంలో నిస్సాన్ మోటర్స్ (33,987) ఉన్నాయి.
ఇదీ చూడండి: సిరి: మీరు ధనవంతులు కావడంలో అడ్డంకులు ఇవే!