నూతన సంవత్సరంలో ప్రజలకు శుభవార్త! మరికొన్ని రోజుల్లో ఉల్లి సహా ఇతర కూరగాయల ధరలు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాజా పంట మార్కెట్లోకి ప్రవేశిస్తుండటం కారణంగా.. లభ్యత పెరిగి, ధరలు తగ్గుతాయని కూరగాయల మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
గత కొన్ని వారాల్లో.. ఉల్లి ధరలు ఆకాశాన్నంటి వినియోగదారు జేబులకు చిల్లుపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.200, కిలో బంగాల దుంప ధర రూ.40కి పైగా పలికింది.
"మరో రెండు నెలల్లో ఉల్లి ధరలు సాధారణ స్థాయికి చేరే అవకాశముంది. దేశీయ ఉల్లి ధర కిలో రూ.80-100 మధ్య ఉంది. అదే టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లి ధర కిలో రూ.50-60 అమ్ముడవుతోంది. ఇది స్థానిక ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఉపయోగపడనుంది. ఒక వేళ దిగుమతి చేసుకున్న ఉల్లి మార్కెట్లో లేకపోతే.. దేశీయ ఉల్లి ధర కిలోకు రూ.300-400కు పెరిగేది." -అంకిత్ బుద్ధి రాజ, హోల్సేల్ కూరగాయల వ్యాపారి, దిల్లీ ఆజాద్పుర్ మండీ.
ఈ ఏడాది దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆ తర్వాత అధిక వర్షాల కారణంగా ఉల్లి సహా ఇతర కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు తాజా పంట చేతికొస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇవి మార్కెట్లకు చేరుకున్నాయి. ఫలితంగా త్వరలోనే టమాటా, బంగాల దుంప, కాలీఫ్లవర్, క్యాప్సికం సహా ఇతర కూరగాయల ధరలు సాధారణ స్థాయికి చేరే అవకాశముంది.
ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...