రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఉన్న డేటా ఛార్జీల మోతకు జియో అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాల వినియోగం భారీగా పెరిగింది. ఇంటర్నెట్ వినియోగంతో గూగుల్‌కు చెందిన వీడియో సేవల విభాగం యూట్యూబ్‌కు వీక్షకులు భారీగా పెరిగారు. వీరు అధిక శాతం వీక్షించే వీడియోలు మాతృ భాషల్లోనే ఉంటున్నాయి. ఈ పరిమాణాల్లో వీక్షకులను ఆకర్షించేందుకు.. ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ వంటి స్థానిక భాషల్లో కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించే కంటెంట్ రూపకర్తలు.. ఇటీవలి కాలంలో చిన్న పట్ణణాలు, టౌన్లలోనూ పెరిగిపోయారు.
భారత్‌లో తమ వినియోగదారులు 'టై ఎలా కట్టుకోవాలి' అనే చిన్న చిన్న విషయాలు నుంచి వ్యవసాయ సంబంధిత అంశాలను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నారని యూట్యూబ్ ఫ్యామిలీ, లెర్నింగ్ భాగస్వామ్య అధిపతి డాన్ అండర్సన్ తెలిపారు.
"ఏడాది క్రితం భారత్‌లో 12 లెర్నింగ్ ఛానళ్లు ఉంటే వారికి 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు. ఇప్పుడా ఛానళ్ల సంఖ్య 70కి చేరింది. వీరికి 14.2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానళ్లన్నింటికీ 100 కోట్ల వరకూ వీక్షణలు వస్తున్నాయి." -డాన్ అండర్సన్, యూట్యూబ్ ఫ్యామిలీ, లెర్నింగ్ భాగస్వామ్య అధిపతి.
వీటితో పాటు లక్షకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న వందలాది ఛానళ్లు యూట్యూబ్‌లో ఉన్నట్లు తెలిపారు డాన్ అండర్సన్. మెట్రో నగరాలతో పాటు టైర్-2,3 పట్టణాల్లో వినియోగం పెరిగింది. ఇలాంటి పట్టణాల నుంచి వస్తున్న కంటెంట్ రూపకర్తలకు ప్రోత్సాహం అందించి.. మరింత నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడానికి పెట్టుబడులు పెట్టనున్నట్లు అండర్సన్ ప్రకటించారు.
ఇదీ చూడండి: జియో మ్యాజిక్: ఈనెల 5న రాబోయే 5 అద్భుతాలు