మన దేశాన్ని ఆత్మనిర్భర్ లేదా స్వావలంబన భారత్‌గా మార్చేందుకు తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఎన్‌కే సింగ్ రాసిన ‘'పోట్రేయిట్స్ ఆఫ్ పవర్'’ పుస్తకావిష్కరణలో ముకేశ్ పాల్గొని ప్రసంగించారు.
‘సాంకేతిక రంగంలో ఇటీవల అంకురాలు ఎలా పుట్టుకొస్తున్నాయో.. ఇప్పుడు చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఆ స్థాయిలో మద్దతు దక్కాల్సిన అవసరం ఉంది. అందుకే క్లిక్‌ల (కంప్యూటర్ల కీ బోర్డులపై క్లిక్‌లు) కంటే బ్రిక్‌లపై (ఇటుకలు) దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద’ని చమత్కరించారు.
'తన తండ్రి ధీరూభాయ్ అంబానీ ఒకానొక సమయంలో తనను అడిగిన ప్రశ్నకు సమాధానమే రిలయన్స్ జియో' అని తెలిపారు. పోస్ట్‌కార్డ్ ఖర్చుతో ప్రతి భారతీయుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకొనే అవకాశం వస్తుందా అని తన తండ్రి ధీరూభాయ్ ఓ సందర్భంలో తనను అడిగారని, దానికి సమాధానమే తక్కువ టారిఫ్‌లతో తీసుకొచ్చిన జియో విప్లవమని ఆయన పేర్కొన్నారు.